కేరళ లోని పలక్కాడ్ జిల్లా లోని కాల్ పతీ వారసత్వ గ్రామంగా ప్రకటించబడింది. ఏటా జరిగే కార్ ఫెస్టివల్ కు పేరొందిన శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామి ఆలయానికి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. ప్రకృతి వర ప్రసాద అందాలతో కూడిన కాల్ పతీ ప్రతీ అంశంలోనూ ప్రత్యేకమైందే. ఈ విశిష్ట గ్రామం విశేషాలు చూద్దాం.
ఆకట్టుకునే అగ్రహారాలు
కాల్ పతీ బ్రాహ్మణుల ఇళ్ళకు నెలువులు ఈ అగ్రహారాలు. ఇక్కడ ప్రతీ ఇల్లు కూడా ఒక నిర్దిష్ట నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఉమ్మడి గోడలను, వాలు పైకప్పులను కలిగి ఉండి, తూర్పు- పశ్చిమం అభిముఖాలుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, వేడుకల మందిరాలు, గోదాములు ఈ అగ్రహారాల్లో ఉంటాయి.
అగ్రహారాలు
అగ్రహారాలు అనేవి బ్రాహ్మణుల కాలనీలు. కొత్త కాల్ పతీ, పాత కాల్ పతీ, చాత్తాప్పురం, గోవిందరాజపురం…ఇలా ఎన్నో కాలనీలు ఉంటాయి. పాత కాల్ పతీలో శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాల్ ఆలయం, చాత్తాప్పురంలో ప్రసన్న మహా గణపతి , గోవిందరాజపురంలో శ్రీ వరదరాజ పెరుమాల్ ఆలయం మరియు కొత్త కాల్ పతీ లో మంతకర మహా గణపతి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాలే ఇక్కడి బ్రాహ్మణ కాలనీల నిర్మాణం, ఆచార వ్యవహారాలను నిర్దేశిస్తాయని అగ్రహారాల నివాసులు విశ్వసిస్తుంటారు.
శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామి ఆలయం
స్థానికంగా దీన్ని “కుండు కోవిళ్” గా వ్యవహరిస్తుంటారు. శ్రీ విశాలక్షి సమేత శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివ పార్వతులు కొలువుదీరి ఉంటారు. ఇది మలబార్ ప్రాంతంలోని అతి పురాతన శివాలయం. కాల్ పతీ నది ఒడ్డున ఇది నెలకొంది. ప్రముఖ ఆలయాల్లో ఇది ఒకటి. పద్దెనిమిది మెట్లకు దిగువన విశ్వనాథ స్వామి ఆలయం నెలకొంది. అందుకే దీన్ని కుండబాళం అంటుంటారు.
కాల్ పతీ రథోత్సవం లేదా కాల్ పతీ తేరు
నవంబర్ మొదటి రెండు వారాల్లో (ఈ ఏడాది నవంబర్ 8-10) జరిగే ఈ రథోత్సవం కేరళకు చెందిన ఈ చిన్ని గ్రామంలో జరిగే అతిపెద్ద వేడుక. దీనికి 700 ఏళ్ళ చరిత్ర ఉంది. కాల్ పతీ లోని నాలుగు ఆలయాల నుంచి నాలుగు రథాలను గ్రామంలోని వీధుల గుండా లాగుతూ ఒరువాళం గా వ్యవహరించే భారీ ఊరేగింపుగా చేస్తారు. ప్రధాన రథంలో శివుడు ఉంటాడు. మరో రెండు చిన్న రథాల్లో ఆయన కుమారులు ఊరేగుతారు. ఇతర గ్రామాల నుంచి వచ్చే రథాలన్నీ కలసి దేవరథ సంగమంగా మారుతాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణ సంగీతోత్సవం. ప్రపంచం నలుమూలల నుంచి ప్రఖ్యాత సంగీతవేత్తలు, గాయకులు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఇక్కడ పాటలు పాడుతారు.
కాల్ పతీకి చేరుకోవడమెలా ?
సమీప పట్టణం : పాలక్కాడ్ ( 3 కి.మీ. దూరం)
సమీప రైల్వే స్టేషన్ : పాలక్కాడ్ జంక్షన్ (1 కి.మీ. దూరం)
సమీప విమానాశ్రయం : కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (55 కి.మీ. దూరం)
Originally written by Jayakrishnan Jayaraj Kozhipurath. Read here.