ప్రముఖ పర్యాటక మ్యాగజైన్ల చేత ప్రపంచంలోనే అద్భుత నగరంగా ఎంపిక చేయబడిన ఉదయ్‌పూర్‌కు రాజస్థాన్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది. 1553లో మహారాజా ఉదయ్‌సింగ్‌చే నిర్మించబడ్డ ఉదయ్‌పూర్ అందమైన సరస్సులకు ప్రఖ్యాతిగాంచింది. లేక్ సిటీ లేదా సిటీ ఆఫ్ లేక్స్‌గా ప్రాచుర్యం పొందిన ఉదయ్‌పూర్‌లో ఉండే సరస్సులు, తమ అందంతో మీ మదిని దోచుకుంటాయి. కాబట్టి, మీరు ఉదయ్‌పూర్‌కు వెళితే, ఈ సరస్సుల్లో పడవ ప్రయాణం చేయడం మర్చిపోకండి.
ఫతేసాగర్ సరస్సు
ఈ సరస్సులో మూడు ద్వీపాలున్నాయి – నెహ్రూ పార్క్ (సరస్సులో ఉండే ప్రముఖమైన పర్యాటక ప్రాంతం), వాటర్‌జెట్ ఫౌంటైన్ ఉండే పబ్లిక్ పార్క్ మరియు ఉదయ్‌పూర్ సోలార్ అబ్జర్వేటరీ (యూఎస్‌వో) కార్యాలయం ఉండే ద్వీపం. 1889లో, కన్నాట్ డ్యూక్, విక్టోరియా మహారాణి మరియు మహారాణా ఫతాసింగ్ రాకను పురస్కరించుకుని కన్నాట్ డ్యామ్ ను నిర్మించారు. ఈ డ్యామ్‌ను తర్వాత మరింత పెంచి ఫతేసాగర్ సరస్సుగా పేరు మార్చారు. సరస్సులోని నీలిరంగు నీళ్లు, వెనుక ఉండే ఆకుపచ్చని పర్వతాలు సుదూరం నుంచే పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతం ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేడుకలకు వేదికయ్యింది. ప్రతీ ఏటా ఫిబ్రవరిలో ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ సంగీత ఉత్సవానికి వేలాది మంది తరలివస్తారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు పాలుపంచుకుంటారు.
పిచోలా సరస్సు
ఈ కృత్రిమ సరస్సును 1362లో నిర్మించారు. దీనికి దగ్గరలోని పిచోలి గ్రామం పేరును పెట్టారు. 4 కి.మీ పొడవైన ఈ సరస్సులో నాలుగు చిన్న ద్వీపాలున్నాయి; జగ్ మందిర్, అర్సి విలాస్, మోహన్ మందిర్ మరియు లేక్ ప్యాలెస్. లేక్ ప్యాలెస్ ఇప్పుడు అతిపెద్ద వారసత్వ హోటల్‌గా మార్చబడింది. ఉదయ్‌పూర్‌లో ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ప్రఖ్యాతి చెందిన జేమ్స్ బాండ్ సినిమా “ఆక్టోపుస్సీ” (1983లో విడుదలైంది) ఈ లేక్ ప్యాలెస్‌లోనే చిత్రీకరించబడింది. చరిత్రను పరిశీలిస్తే, షాజహాన్, తన తండ్రిపై తిరుగుబాటు చేసినప్పుడు ఇక్కడి జగ్‌మందిర్‌లో ఆశ్రయం పొందాడు. ఇవాళ, ఉదయ్‌పూర్‌లోనే ఆకర్షణీయమైన సరస్సు ఈ పిచోలా సరస్సు.
జైస్మండ్ సరస్సు
భోపాల్‌లోని అప్పర్ సరస్సు తర్వాత, దేశంలోనే రెండో అతిపెద్ద కృత్రిమ సరస్సు జైస్మండ్ సరస్సు. విజయపు రాణిగా దీన్ని పిలుస్తారు. 87 కిలోమీటర్ల వైశాల్యంలో ఉండే ఈ సరస్సును స్థానికులతో పాటు పర్యాటకులూ ఎక్కువగా సందర్శిస్తుంటారు. సరస్సులో ఉండే ఎన్నో దీవులు మిమ్మల్ని నగరపు రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం కలిగిస్తూ మరో లోకానికి తీసుకువెళ్తాయి. దగ్గర్లోని వన్యప్రాణి కేంద్రాన్ని దర్శించడమూ మధురానుభూతిని మిగుల్చుతుంది. మహారాణా జైసింగ్ ఈ సరస్సుపై మార్బుల్ తో ఆనకట్టను నిర్మించారు. ఇక్కడే ప్రఖ్యాతిగాంచిన హవా మహల్ ప్యాలెస్ ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలతో మీరు ఎంతో ఉపశమనం పొందవచ్చు.
ఉదయ్‌సాగర్ సరస్సు
ఉదయ్‌పూర్‌లోని ప్రముఖమైన ఐదు సరస్సుల్లో ఒకటి 4 కి.మీ పొడవైన ఉదయ్‌సాగర్ సరస్సు. ఆకర్షణీయమైన ఈ సరస్సును మహారాణా ఉదయ్ సింగ్ 1565లో నిర్మించారు. అప్పటి నుంచి ఉదయ్‌పూర్ అందాల్లో ఇది భాగమయ్యింది. అద్భుతమైన ఫోటోలను తీయాలనుకునే ఫోటోగ్రాఫర్స్‌కు ఇది స్వర్గధామమని చెప్పొచ్చు. నీలి రంగు నీళ్లు, పైన నిర్మలమైన ఆకాశం, చుట్టూ ఉండే పచ్చని కొండలు ఫోటోగ్రాఫర్లకు విందు లాంటివే. అందుకే, ఉదయ్‌సాగర్ సరస్సుకు పోటెత్తుతారు.
దూద్ తలై సరస్సు
దూద్ తలై సరస్సు దగ్గర ఎన్నో ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఒంటెల ప్రయాణం, గుర్రాల ప్రయాణంతో పాటు బోటు ప్రయాణం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఈ సరస్సు చుట్టూ కొండలు ఉంటాయి, ఓ కొండపై కర్ణి మాత ఆలయం ఉంటుంది. అక్కడికి రోప్ మార్గం ద్వారా వెళ్లవచ్చు. ఈ ప్రయాణం 500 మీటర్ల పైకి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి పిచోలా సరస్సు, సజ్జన్‌గఢ్ కోట మరియు దూద్‌తలై సరస్సుల అందాలను రోప్ వే క్యాబిన్‌నుంచి అద్భుతంగా వీక్షించవచ్చు.