అరుణాచల్‌లో తవాంగ్, ఇటానగర్ మరియు జీరో వ్యాలీ ప్రముఖమైన ప్రాంతాలు, కానీ, ఇంకా అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయని మీకు తెలుసా? రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలకు దూరంగా ఉండే అంతగా తెలియని ఈ ప్రాంతాలను ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా దర్శించాలి.
తేజు పట్టణం
అరుణాచల్‌లో పెద్దగా తెలియని లోహిత్ జిల్లాలో లోహిత్ నది పక్కగా ఉండే చిన్న పట్టణం తేజు, దేశంలోనే చాలా అందమైన ప్రాంతాలకు నెలవు. ఆధునీకరణ, వేగవంతమైన టెక్నాలజీలు ఇంకా ఈ ప్రాంతాన్ని ముంచెత్తలేదు. ప్రకృతి అందాలతో నిండి ఉండే ఈ తేజు, మనుషులు గాడ్జెట్స్‌కు అతుక్కుపోకుండా, ప్రకృతితో మమేకమై ఉండే కాలానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. తేజు పర్యటన ఎన్నో అందమైన ప్రదేశాలను చూసే భాగ్యాన్ని మీకు కలిగిస్తుంది.
పరుశురామ కుండ్
పరుశురామ్ దేవుడి పేరున ఇది ఏర్పడింది. బ్రహ్మపుత్ర ఒడ్డున పరుశురామ ఆలయం ఉంటుంది. ఇక్కడి సరస్సులోని పవిత్రమైన జలాల్లో స్నానమాచరిస్తే పాపాలన్నీ పోతాయన్నది భక్తుల నమ్మకం. ఈ విశ్వాసమే మకర సంక్రాంతి రోజున వందలాది మంది భక్తులను పరుశురామ కుండ్‌కు ఆకర్షిస్తోంది.
గ్లో లేక్
మంచుతో కప్పబడిన హిమాలయాలకు, చుట్టూ ఉండే పచ్చని ప్రకృతికి మధ్య, సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తున ఉంటుందీ అద్భుతమైన సరస్సు. ఈ అందమైన సరస్సును చూస్తూ మీరు విశ్రాంతి తీసుకోవచ్చు లేదా చుట్టూ ఉండే పర్వతాలను ఎక్కడం ద్వారా సాహసకృత్యాలు చేయవచ్చు.
వాలాంగ్
యుద్ధ స్మారకంగా ఇది ప్రాచుర్యం పొందింది, వాలాంగ్‌లోని నమ్తీ వ్యాలీ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. వెదురు చెట్లతో అలంకరించినట్లుండే వాలాంగ్, 1962లో భారత్‌లోకి చొరబడ్డ చైనా సైనికులతో భారత సైనికులు చేసిన వీరోచిత పోరాట ప్రాంతంగా ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించుకుంది.
తేజు మ్యూజియం మరియు హస్తకళల కేంద్రం
భారత్‌లోని భాగమైన ఈ ప్రాంతపు జీవనశైలిని మరియు సంస్కృతిని అర్థం చేసుకోవడానికి, మ్యూజియాన్ని దర్శించుకోవడం తప్పనిసరి. ఈ మ్యూజియంలో స్థానిక ఆదివాసీలు ఉపయోగించిన అరుదైన చిత్రాలు, చేతిప్రతులు మరియు ఆయుధాలు, దుస్తులు మరియు ఆభరణాల అరుదైన సేకరణ ఉంది. వెదురు మరియు చేనేత వస్తువులు ఇక్కడ చూడొచ్చు.
డి’ఎరిగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ
ఈ రక్షిత అభయారణ్యం పులులు, ఏనుగులు, అడవి జింకలు మరియు అడవి పందులకు నిలయం. వరదప్రాంత మైదానాల్లో ఉన్న ఈ రక్షిణ అభయారణ్యంలో కణితులు ఎక్కువగా కనిపిస్తాయి. 150 రకాలకు పైగా పక్షులు, అంతరించిపోతున్న రకాలను కూడా ఈ శాంక్చురీలో చూడొచ్చు.
తేజుకు ఎలా చేరుకోవచ్చు?
అస్సాంలోని ధెమాజీ దగ్గర్లో ఉన్న ముర్కంగ్‌సెలెక్ స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. కోల్‌కతా, ఢిల్లీ నుంచి ఇక్కడికి రైలు సదుపాయం ఉంది.
తేజును సందర్శించడానికి మేలైన సమయం
తేజును వేసవి నెలల్లో సందర్సించడం మేలు (ఏప్రిల్ నుంచి జులై). కానీ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలు కూడా మంచి సమయమే.
కాబట్టి, మీరు గనక జీరో వ్యాలీ లేదా ఇటానగర్‌కు వెళ్తుంటే, ఈ అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించడం మర్చిపోకండి.