ఆశ్చర్యదాయక విశేషాలెన్నింటికో నిలయం భారతదేశం. అందులో భాగమైన ఈశాన్య రాష్ర్టాల్లో కూడా విశేషాలకు కొదవ లేదు. భారతదేశ ఈశాన్య ప్రాంతం అద్భుత ప్రాంతాలను, మార్మిక అడవులను, స్వచ్ఛ సరస్సులను, ప్రశాంత బౌద్ధ ఆరామాలను కలిగి ఉంటుంది. ఈశాన్య ప్రాంతంలోని ఎన్నో అందమైన ప్రాంతాల్లో ఒకటి లోక్తక్ సరస్సు. పర్యాటకపరంగా మణిపూర్ రాష్ర్ట ప్రత్యేకతలలో ఒకటిగా అది నిలుస్తుంది.
లోక్తక్ సరస్సు మణిపూర్ రాష్ర్టంలో నెలకొంది. ఈశాన్య భారతంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరొందింది. ఫుండీస్ కారణంగా ప్రపంచపు తేలియాడే సరస్సుగా కూడా ఇది గుర్తింపు పొందింది. ఫుండీస్ అనేవి పెద్ద, స్పాంజీ, సాసర్ ఆకారంలోని దీవులు. జలమట్టానికి దిగువన మట్టితో ఇవి పచ్చదనాన్ని కలిగి ఉంటాయి. ఈ సహజ ఫుండీస్ వాటి పరిమాణం, అందులో ఉండే జీవరాసుల సంఖ్య పరంగా కూడా పెద్దవే. ఇలాంటి దీవులు సరస్సు లో ఎన్నో ఉన్నాయి. ఇవి స్థలం మారుతూ ఉంటాయి కూడా. నిజమే, అవి తమ పరిమాణాన్ని (సైజ్) మార్చుకుంటూ ఉంటాయి. ఏడాది పొడుగునా వివిధ రుతువుల్లో సరస్సు అంతటా అలా కదులుతూ ఉంటాయి.
మణిపూర్ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా ఈ లోక్తక్ సరస్సుపై ఎంతగానో ఆధారపడ్డారు. ఈ సరస్సు ను మణిపూర్ కు జీవనప్రదాతగా చెప్పవచ్చు. ఈ తేలియాడే దీవుల్లో నివసిస్తూ, అక్కడే తింటూ, పని చేసుకుంటూ 4000 మంది జీవితాలు గడుపుతున్నారు. ప్రపంచపు ఏకైక తేలియాడే నేషనల్ పార్క్ అయిన కైబుల్ లామ్జావో కూడా ఈ తేలియాడే దీవుల్లోనే ఉంది. ఎంతో తీవ్రస్థాయిలో అంతరించిపోయే ముప్పును ఎదుర్కొంటున్న మణిపూర్ డాన్సింగ్ డీర్ అయిన సాంగైను కాపాడేందుకు ఇక్కడ జాతీయ పార్క్ ను నెలకొల్పారు. ఈ రకం సాంగై ఈ దీవుల్లో తప్ప మరెక్కడా లేదు.
లోక్తక్ సరస్సు అపార జీవవైవిధ్యానికి నిలయం. ఇక్కడ 233 రకాల నీటి మొక్కలున్నాయి. వందకు పైగా పక్షి జాతులు ఈ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. కొండచిలువ, బార్కింగ్ డీర్, సాంబార్ వంటి అరుదైన జీవులతో పాటుగా 425 రకాల జంతువులు ఇక్కడ జీవిస్తున్నాయి.
నమ్మశక్యం కాని తేలియాడే దీవులపై ప్రకృతి అందాల మధ్య విహరించడం ఓ మరుపురాని అనుభూతి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలలోపు ఈ దీవులను సందర్శించాలి. ఆ సమయంలో సాంగై జింకలు మందలుగా ఆహారం కోసం బయటకు వస్తాయి.