రాజ్ పుట్స్ నేలగా పేరొందిన రాజస్థాన్ అంటే రాజమహాళ్లు, కోటలు, మ్యూజియంలు, ఎడారి సవారీలకు ప్రసిద్ధి. కానీ ఈ ప్రాంతం అంతరించిపోతున్న ఎన్నో రకాల వన్యప్రాణులకు ఆవాసమైంది. రాజపుత్రుల రాష్ట్రంలో ఎన్నో అభయారణ్యాలు ఉన్నాయి.
రణథంబోర్ జాతీయ పార్కు, సవాయ్ మథోపూర్: దీనిని 1980లో జాతీయ పార్కుగా ప్రకటించారు. ఇక్కడ పులులు, చిరుతపులులు, నీల్గాయ్, అడవి పంది లాంటి జీవులను వాటి సహజ సిద్ధ జీవన శైలిలో చూడటానికి ఇది అత్యుత్తమ ప్రాంతం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లు తప్పనిసరిగా చూడాలని కోరుకునేది మచిలీగా పిలువబడే అందమైన ఆడపులిని చూడటానికే. అది ఒకసారి 10 అడుగుల పొడవు ఉన్న మొసలితో పోరాడి చంపేసింది. అప్పటి నుంచి దీనికి ‘‘క్రొకడైల్ కిల్లర్’’ అన్న పేరు దక్కింది.
సమీపంలోని రైల్వే స్టేషన్ సవాయ్ మథోపూర్.
సరిస్క జాతీయ పార్కు, ఆళ్వార్: ఇతర ప్రాంతాల నుంచి పులుల్ని తీసుకొచ్చి పెంచడంలో విజయవంతమైన పార్కుల్లో ప్రపంచంలోనే మొదటిది సరిస్క. ఫారెస్టు అధికారులు 2005లో ఈ అభయారణ్యంలో పులులు పూర్తిగా అంతరించిపోయిన విషయం గుర్తించారు. ఆ తర్వాత ఇతర పులుల సంరక్షణ అభయారణ్యాల నుంచి పులుల్ని ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 14 పులులు ఉన్నాయి. ఇక్కడ అనేక అరుదైన పక్షి జాతులు కూడా ఉన్నాయి. బూడిదరంగు ప్యాట్రిడ్జ్, తెల్ల మెడ కింగ్ ఫిషర్, భారతీయ గ్రద్ద, గుడ్లగూబ ఇక్కడ కనిపిస్తాయి.
సమీపంలోని రైల్వే స్టేషన్ ఆళ్వార్ (36 కి.మీ దూరంలో ఉంది)
దారా నేషనల్ పార్క్, కోటా: చంబల్ అభయారణ్యం, జశ్వంత్ సాగర్ అభయారణ్యం కలిసి సుందరమైన దారా అభయారణ్యంగా ఏర్పడ్డాయి. జాతీయ పార్కుగా ప్రకటించక ముందు కోటా మహారాజులు తమ వేటకు ఈ ప్రాంతాన్ని ఉపయోగించుకునేవారు. అడవి పందులు, జింకలు, తోడేళ్లు, చిరుతపులులు వంటి వన్యప్రాణులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడ చంద్రభాగా నది ఒడ్డున 7వ, 8వ శతాబ్దాల నాటి అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి.
ఈ అభయారణ్యానికి సమీపంలోని రైల్వే స్టేషన్ కోటా (50 కి.మీ దూరంలో ఉంది.)
మౌంట్ అబూ అభయారణ్యం, మౌంట్ అబూ: దాదాపు 250కి పైగా పక్షి జాతులు, బూడిద రంగు అడవి కోడి, చిరుతపులు, కోతులు, హైనాలు, ముళ్లపందులు, హెడ్జ్ హాగ్ వంటి వాటిని ఇక్కడ చూడవచ్చు. ట్రెక్కింగ్ చేసేవారికి ఇది రాజస్థాన్ లో అత్యంత అనువైన ప్రాంతం.
ఈ అభయారణ్యం అబూ రోడ్ కి 25 కి.మీ దూరంలో ఉంది.
సీతా మాత అభయారణ్యం, ప్రతాప్ గఢ్: ‘‘ఎగిరే ఉడతలు’’కు ఈ అభయారణ్యం పుట్టిల్లు. ఫిబ్రవరి, మార్చి మధ్యకాలం ఈ ఎగిరే ఉడతల్ని చూసేందుకు అత్యంత అనువైన కాలం, అప్పుడే మహువా చెట్ల ఆకులు పందిళ్లు మాదిరగా ఏర్పడతాయి. చిన్న గ్రీబ్, ఆరెంజ్ బ్రౌన్ గెద్ద, ఊదా రంగు ముర్హెన్, పింఛంతో కూడిన భరత పక్షితో సహా 130కిపైగా పక్షి జాతులను ఇక్కడ చూడొచ్చు.
ఈ అభయారణ్యానికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ఉదయ్ పూర్.
Originally written by Punit Sharma. Read here.